యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంక్షిప్తంగా.. యూపీఎస్‌సీ! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఎంతో సుపరిచితమైన పేరు! దేశంలోనే అతి పెద్ద రిక్రూట్‌మెంట్ బోర్డ్!

బ్యాచిలర్ డిగ్రీతో పోటీ పడే అత్యున్నత సివిల్ సర్వీసెస్ మొదలు.. ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే ఎన్‌డీఏ–ఎన్‌ఏ వరకు.. అనేక కీలక సర్వీసులకు యూపీఎస్సీ నియామక ప్రక్రియ చేపడుతుంది. ఇందుకోసం ముందుగానే ఆయా పరీక్షలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఇటీవల 2025 సంవత్సరానికి సంబంధించి ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. యూపీఎస్‌సీ నిర్వహించే ముఖ్యమైన పరీక్షలు, వాటి వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్షల తేదీలు తదితర ముఖ్య సమాచారం..
పరీక్షలు ఇవే
యూపీఎస్‌సీ 2025 రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను పరిశీలిస్తే.. సివిల్ సర్వీసెస్ సహా మొత్తం 15 పరీక్షలను నిర్వహిస్తోంది. సివిల్స్,ఐఎఫ్‌ఎస్,ఈఎస్ ఈ, ఎన్‌డీఏ–ఎన్‌ఏ, సీడీఎస్‌ఈ, సీఎంఎస్ వంటి కీలక సర్వీసులకు నియామక ప్రక్రియ చేపడుతోంది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
ప్రిలిమ్స్ నోటిఫికేషన్ తేదీ: 2025, జనవరి 22;
దరఖాస్తుకు చివరి తేదీ: 2025, ఫిబ్రవరి 11;
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 2025, మే 25;
మెయిన్ ఎగ్జామినేషన్: 2025 ఆగస్ట్ 22 నుంచి అయిదు రోజులు.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉతీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తుకు అర్హులు.
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లుగా మొత్తం 400 మార్కులకు ఉంటుంది. పేపర్–1లో జనరల్ అవేర్‌నెస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్–2లో కాంప్రహెన్షన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
మెయిన్ ఎగ్జామినేషన్
రెండో దశలో పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్ ఎగ్జామినేషన్‌లో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. అవి..జనరల్ ఎస్సే(పేపర్–1), జనరల్ స్టడీస్–1 (పేపర్–2), జనరల్ స్టడీస్ –2 (పేపర్–3), జనరల్ స్టడీస్–3 (పేపర్–4), జనరల్ స్డడీస్–4 (పేపర్–5), ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–1 (పేపర్–6), ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–2 (పేపర్–7). ఒక్కో పేపర్‌కు 250 మార్కులు చొప్పున మొత్తం 1750 మార్కులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. పేపర్–6, పేపర్–7లకు సంబంధించి అభ్యర్థులు యూపీఎస్సీ నిర్దేశించిన 25 ఆప్షనల్ సబ్జెక్ట్‌లలో ఏదో ఒక సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా చివరగా పర్సనాలిటీ టెస్ట్ పేరుతో 275 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది విజేతలను ప్రకటిస్తారు.